: వర్ణశోభితంగా సాగుతోన్న సమ్మక్క-సారక్క జాతర


వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం ప్రారంభమైన ‘సమ్మక్క-సారక్క జాతర‘ వర్ణశోభితంగా సాగుతోంది. రెండేళ్లకొకసారి మాఘ మాసం పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. దీంతో నిత్యం నిర్మానుష్యంగా ఉండే మేడారం.. జనసంద్రంగా మారింది. ప్రధాన గిరిజన పూజారి కన్నెపల్లిలో పూజలు చేసిన అనంతరం సారలమ్మ దేవతను తీసుకువచ్చి మేడారంలోని గద్దె వద్దకు చేర్చారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దె పైకి చేరారు. జాతర పరిసరాల్లో దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది.

రెండవ రోజైన ఇవాళ సాయంత్రం మేడారానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలగుట్టలో గిరిజన పూజారులు పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క దేవతను మేడారంలో గద్దె వద్దకు తీసుకువస్తారు. దాంతో పూర్తి స్థాయి జాతర తంతు మొదలవుతుంది. మూడోరోజున అనగా శుక్రవారం రోజున భక్తులు దేవతల దర్శనం చేసుకుంటారు. శనివారంనాడు ఇద్దరు దేవతలను అరణ్యంలోకి తీసుకువెళ్ళడంతో జాతర ముగుస్తుంది. అప్పటి పాలకులపై దమననీతికి వ్యతిరేకంగా తల్లీకుమార్తెలు సమ్మక్క, సారలమ్మ పోరాటానికి గుర్తుగా ఈ జాతర జరుపుకుంటారు. మేడారం మహా జాతరకు మన రాష్ట్రం నుంచే కాక.. ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల భక్తులు తరలివచ్చి సమ్మక్క-సారక్క దర్శనం చేసుకొంటారు.

  • Loading...

More Telugu News