: మగాళ్లు అలా ఉంటేనే స్త్రీలకు ఇష్టం
'ఆరడుగుల అందగాడు.. నన్ను బార్బీగర్ల్' అన్నాడు అని ఓ సినీ కవి చెప్పినట్టు మగాళ్లు పొడుగ్గా ఉంటే స్త్రీలకు ఇష్టం అని పరిశోధనలు నిగ్గు తేల్చాయి. రచయితలు, కథకులు తమ కథానాయకులను ఆరడుగుల ఆజానుబాహుడు అని సంబోధించడమో లేక, అంత పొడుగు అప్పట్లో సాధరణమో తెలియదు కానీ, మగాళ్ల శక్తి సామర్థ్యాలను పొడుగుతోనే ప్రారంభించేవారు. దీంతో మగాడు అంటే ఆరడుగుల పొడవు.. విశాలమైన ఛాతి, కండలు తిరిగిన దేహం వంటి పోలికలు సాధారణంగా మారిపోయాయి.
దీంతో, అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పురుషుల ఎత్తుకు, స్త్రీలకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అని పరిశోధించారు. చివరకు పొడవుగా ఉండే మగాళ్లనే స్త్రీలు ఇష్టపడతారని నిర్ధారించారు. స్త్రీలు తమకన్నా ఎత్తుగా ఉన్న మగాళ్లనే ఇష్టపడడానికి కారణం తమకు రక్షణ కల్పించగలడన్న భరోసా అని తేల్చారు. ముందు నుంచీ ఉన్నట్టు సంప్రదాయం, శారీరక నిర్మాణం అన్నీ పొడుగ్గా ఉండేవారిలో ఉంటాయన్న నమ్మకమే స్త్రీలను అటు ఆకర్షిస్తోందని పరిశోధకులు చెప్పారు. అదే సమయంలో తమతో మృదువుగా వ్యవహరించాలని కూడా స్త్రీలు కోరుకుంటారని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఎమర్సన్ తెలిపారు. అదే సమయంలో పురుషులు మాత్రం తమ కంటే తక్కువ ఎత్తు ఉన్న స్త్రీలనే ఇష్టపడతారని వెల్లడించారు.