: వాళ్ళిద్దరంటే మీడియా పడిచస్తుందట!
ఓ మోస్తరు నాయకులను అంతగా పట్టించుకోని మీడియా, వాళ్ళిద్దరంటే పడిచస్తుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అంటున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు మీడియా అత్యంత ప్రాచుర్యం కల్పిస్తోందని చెప్పారు. మోడీ, లాలూ.. ఇద్దరూ కూడా 'డార్లింగ్స్ ఆఫ్ మీడియా' అని నితీశ్ అభివర్ణించారు. వారిద్దరికీ మీడియాను ఎలా ఆకర్షించాలో, ఏ విధంగా ఆకట్టుకోవాలో బాగా తెలుసని వివరించారు. అవసరంలేకున్నా వివాదాన్ని సృష్టించడం, మీడియా దృష్టిని తమవైపు మళ్ళించుకోవడం, తద్వారా తమ సభలకు భారీగా జనాన్ని రప్పించుకోవడం.. వీరికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.
అదే తమ జేడీ (యూ) పార్టీ నిర్వహించే సభలకు మీడియా ఏమంత ప్రాచుర్యం ఇవ్వదని వాపోయారు నితీశ్. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 3న బీజేపీ, ఆర్జేడీ బీహార్లోని ముజఫర్ పూర్ లో సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసం ఆ రెండు పార్టీలు ఇప్పటి నుంచే మీడియాను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయని నితీశ్ దుయ్యబట్టారు.