: థర్డ్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్ బచావో ఫ్రంట్: మోడీ
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యమ్నాయంగా ఏర్పడేందుకు చూస్తున్న థర్డ్ ఫ్రంట్ పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. అసలు ఎవరీ థర్డ్ ఫ్రంట్ వ్యక్తులు? అని ప్రశ్నించిన మోడీ, ఢిల్లీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్న పదకొండు పార్టీల్లో తొమ్మిది పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న వారేనన్నారు. కానీ, ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ముసుగు వేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దేశంలో థర్డ్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్ బచావో ఫ్రంట్ (కాంగ్రెస్ ను రక్షించేందుకు) అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోడీ ఈ మేరకు ప్రసంగించారు. 2014 ఎన్నికలు రాజకీయాలను ప్రక్షాళన చేసే ఎన్నికలని పేర్కొన్నారు.