: ఆర్రోజుల పాటు.. అత్యంత పాశవికంగా..
ఉత్తర భారతదేశంలో అత్యాచారాలకు అడ్డుకట్ట పడడం లేదు. రాజస్థాన్ లోని భన్స్ డా ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదివే బాలికపై అత్యంత హేయమైన రీతిలో అత్యాచారం జరిగింది. పెళ్ళికని వెళ్ళిన బాలికను అపహరించి ఆర్రోజుల పాటు అత్యాచారం చేశారు కొందరు కామాంధులు. జనవరి 30న బాలిక కిడ్నాప్ కాగా, విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. వివాహానికి హాజరయ్యేందుకు బమ్నియా గ్రామానికి తన మిత్రులతో కలిసి వెళ్ళిందీ బాలిక. అక్కడ బాలిక మిత్రురాళ్ళలో ఒకరు బహిర్భూమికి వెళ్ళేందుకుని బాధిత బాలికను తోడు తీసుకుని వెళ్ళింది. అక్కడ హఠాత్తుగా ఓ వాహనంలో వచ్చిన ఆరుగురు దుండగులు బాలికను అపహరించారు.
వారం రోజుల పాటు పలు ప్రదేశాలు మార్చుతూ, ఆమెపై దారుణంగా అత్యాచారం జరిపారు. బాలిక కోసం ఆమె కుటుంబ సభ్యులు చెట్టూపుట్టా వెదుకుతున్నా ఫలితం కనిపించలేదు. మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. అయితే, ఫిబ్రవరి 7న బాలికను ఆమె ఇంటి ముందే వదిలి పరారయ్యారా వ్యక్తులు. కాళ్ళూ చేతులు కట్టేసి, ఒళ్ళంతా రక్తమోడుతున్న స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఆమె ఉదయ్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, బాలికను బహర్భూమికని తీసుకెళ్ళిన మరో అమ్మాయిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.