: ఒలింపిక్స్ లో మళ్ళీ త్రివర్ణ పతాకం రెపరెపలు
భారత్ మళ్ళీ ఒలింపిక్ కుటుంబంలో భాగమైంది. కళంకితులకు కార్యవర్గంలో చోటు కల్పించినంత కాలం వేటు తప్పదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ).. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, రెండ్రోజుల క్రితం ఐఓఏ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో ఐఓసీ కరుణించింది. భారత్ పై సస్పెన్షన్ ను తొలగిస్తున్నామంటూ ప్రకటించింది. ఇకపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకం నీడలోనే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటారు. ప్రస్తుతం రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ఒలింపిక్ పతాకం కింద ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐఓసీ తాజా నిర్ణయంతో ఇకమీదట వారు మువ్వన్నెల జెండాను చేతబూనవచ్చు. ఆదివారం ఐఓఏ నిర్వహించిన ఎన్నికల్లో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ సోదరుడు రామచంద్రన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.