: వెంకన్న భక్తులకు.. ఇక నుంచి రెండు లడ్డూలే!
హైందవ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారు. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు లడ్డూ ప్రసాదాన్ని తప్పనిసరిగా తీసుకెళతారు. బంధుమిత్రులకు, ఆ లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టినా పుణ్యమేనని వారి నమ్మకం. అలాగే, తిరుమలేశుని దర్శించుకుని వచ్చిన భక్తులను లడ్డూ కావాలని స్నేహితులు అడిగి మరీ తీసుకుంటారు. దాంతో, ఈ లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన విషయం విదితమే.
వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే.. లడ్డూ ప్రసాదానికి కోత విధించేందుకు తాజాగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నాలుగు లడ్డూలను అందిస్తుండగా.. ఇక ఇవాళ్టి నుంచి రెండు లడ్డూలను మాత్రమే అందించాలని వారు నిర్ణయించారు. టీటీడీకి ప్రసాదాల అమ్మకాలతో అధికమొత్తంలో ఆదాయం వచ్చిపడుతున్నా.. లడ్డూలపై కోత విధించడంపై సర్వత్ర విమర్శలు వినవస్తున్నాయి. వీఐపీలకు మాత్రం సిఫార్సులపై ఎన్ని లడ్డూలన్నా దొరుకుతున్నాయని, నిజమైన భక్తులకే లడ్డూలు అందడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.