: 10 రూపాయల ప్లాస్టిక్ కెరెన్సీ నోట్లు సిద్ధం
కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు దేశంలో అడుగుపెట్టబోతున్నాయి. ప్రయోగాత్మకంగా ఒక్కోటీ రూ. 10 విలువ గల 100కోట్ల నోట్లలను భారతీయ రిజర్వ్ బ్యాంకు ముందుగా ఐదు పట్టణాల్లో ప్రవేశపెడుతుంది. వీటిలో కోచి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇవి జూలై నుంచి చెలామణీలోకి వస్తాయని తెలిపారు.
కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్ల మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. ప్లాస్టిక్ నోట్ల సగటు మన్నిక కాలం 5 సంవత్సరాలు. పైగా శుభ్రతలో వీటిదే పై చేయి. కాపీ కొట్టి నకిలీ కరెన్సీ తయారీకి కుదరదు. ఇప్పటికే ఆస్ట్రేలియా తదితర దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. 2013లో మొత్తం 3.33లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.17.64కోట్లు ఉంటుందని మంత్రి నమోనారాయణ్ తెలిపారు.