: ఈ వైద్యులకు రోగి ప్రాణాలకంటే మంత్రే ముఖ్యం
'వైద్యో నారాయణ హరి' అన్న నానుడికి ఈ డాక్టర్లు అక్షరాలా మచ్చతెచ్చారు. రోగి ప్రాణాలకంటే మంత్రిగారి కార్యక్రమానికే ప్రాధాన్యమిచ్చి అప్రదిష్ఠ పాలయ్యారు. వివరాల్లోకెళితే.. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో కాంతి దేవి (65) మహిళ హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రిలో జాయిన్ అయింది. అదే సమయానికి హాస్పిటల్ కు 100 మీటర్ల దూరంలో 'స్వస్థ్య జన్ సోచ్నా అభియాన్' పథకం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సంతోష్ చౌధరి హాజరయ్యారు. దీంతో, ఆసుపత్రిలో వైద్యులు కూడా మంత్రిగారి కార్యక్రమానికి తరలివెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ, ఆ మహిళ అప్పటికే ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమె తనయుడు డాక్టర్లను ఎంత బతిమాలినా వారు వినిపించుకోలేదు. వైద్యం చేసేందుకు ససేమిరా అన్నారు. వారి మానాన వారిని వదిలేసి మంత్రిగారి కార్యక్రమానికి వెళ్ళారు. దీంతో, ఆ వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది.
ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె కుమారుడు సింగ్, వారి బంధువులు మంత్రి గారి కార్యక్రమానికి వెళ్ళి ఆందోళన చేశారు. సదరు మంత్రి ఆమె మరణానికి బాధ్యత తీసుకునేందుకు నిరాకరించడంతోపాటు ఆమెది సహజ మరణం అని ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక, వీఐపీల రద్దీ కారణంగా కార్డియాలజిస్ట్ రావడం ఆలస్యమైందని, అందుకే ఆమె మరణించిందని చెప్పి ఆసుపత్రి సివిల్ సర్జన్ ఒకరు విషయాన్ని అంతటితో ముగించే ప్రయత్నం చేశారు.