: కొడుకు, కోడలూ త్యాగశీలురంటున్న బాబు
తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికార పీఠంపై కూర్చుండబెట్టేందుకని అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' అంటూ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పైబడుతున్న వయస్సును పక్కనబెట్టి మరీ, గత నాలుగు నెలలుగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా నడక సాగిస్తున్నారు. కార్యకర్తలను వచ్చే ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేస్తూ కర్తవ్య బోధ నెరపుతున్నారు.
త్యాగాలకు వెనుదీయవద్దని వారికి నూరిపోస్తున్నారు కూడా. ఆ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీలో బాబు మాట్లాడారు. ఎన్నో కష్టాలకోర్చి తాను చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా.. తన కుమారుడు, కోడలు వారి ఆనందాన్ని సైతం త్యాగం చేస్తున్నారని చెప్పి కార్యకర్తల్లో ఉత్తేజం రగిల్చే ప్రయత్నం చేశారు.
సతీమణి భువనేశ్వరి ప్రతి వారాంతంలో స్వయంగా వచ్చి తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారని బాబు చెప్పారు. ఇక వచ్చే ఏడాది తెలుగుదేశం పార్టీకి అత్యవసర కాలమని బాబు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో బాబుతో పాటు పార్టీ నేతలు గరికిపాటి రామ్మోహనరావు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.