: బాలీవుడ్ నటులకు పాఠాలు చెబుతున్న బీహార్ కుర్రాడు
బాలీవుడ్ లో నటులకు పనంతా జాతీయ భాష హిందీతోనే. వాళ్ళు కొన్ని సన్నివేశాల్లో పదాలను అత్యంత స్పష్టంగా పలకాల్సి ఉంటుంది. అయితే, ఇంగ్లిష్ మీడియం చదివిన కొందరు నటీనటులు హిందీ రాయడం సంగతటుంచితే, సరిగా మాట్లాడలేరు కూడా. అందుకే ఈ బీహార్ కుర్రాడికి అంత డిమాండ్. విషయం ఏమిటంటారా.. బీహార్ కు చెందిన వికాస్ కుమార్ పుణేలో ఎంబీఏ చదువుతున్నప్పుడు సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగింది. ఎన్నో ఆడిషన్లకు కూడా హాజరయ్యాడు. అయితే, నటుడిగా అవకాశం రాలేదు కానీ, అతని ఉచ్చారణ, కంఠస్వరం అతనికి అద్భుతమైన అవకాశాన్ని అందించాయి.
సీన్ కట్ చేస్తే.. వికాస్ ఇప్పుడు నసీరుద్దీన్ షా, విద్యా బాలన్ వంటి నటులకు హిందీతో పాటు, ప్రాంతీయ భాషలను ఎలా పలకాలో నేర్పిస్తున్నాడు. ఇంతజేసీ, ఈ బీహారీకి హిందీలో ఎలాంటి ప్రత్యేకమైన డిగ్రీలు లేవు. ఉన్నదల్లా స్పష్టమైన వాచకం మాత్రమే. ఈ విషయమై వికాస్ ను అడిగితే, 'అంతా దేవుడి దయ' అంటాడు. తన యాక్టింగ్ కో్రికను తీర్చుకునే క్రమంలో సోనీ టీవీ వారి కొన్ని సీరియళ్ళలోనూ నటించాడీ యంగ్ బీహారీ.