: 'ఓటుకు నోటు' వ్యవహారాన్ని తిరగతోడుతున్న ఆమ్ ఆద్మీ
యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో ' ఓటుకు నోటు' వ్యవహారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరగతోడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో 2013లో సమాజ్ వాదీ మాజీ నేత అమర్ సింగ్, మరో ఐదుగురిని నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు విడుదల చేయటాన్ని ఏఏపీ సవాల్ చేయనుంది. వీరంతా అంతకుముందు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు ఓ లేఖ రాసింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో ఛాలెంజ్ చేసేందుకు ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేసింది.
2008లో న్యూక్లియర్ ఒప్పందం సందర్భంగా లోక్ సభలో నిర్వహించే విశ్వాస తీర్మానం సమయంలో సహకరించేందుకు యూపీఏ ప్రభుత్వం లంచం ఇచ్చిందంటూ కొంతమంది ఎంపీలు సభలో నోట్ల కట్టలు చూపించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2011లో ఈ వ్యవహారంలో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సమాజ్ వాదీ మాజీ నేత అమర్ సింగ్ కు కూడా ఉన్నారు.