: రాజకీయ నేతలకు కార్పొరేట్ జీతాలివ్వాలంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
అవినీతి.. సామాన్యుడి పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిన అతిపెద్ద సామాజిక రుగ్మత. దీన్ని రూపుమాపడానికి ఎన్నెన్ని వ్యవస్థలో.. వాటి అవస్థలు చెప్పనలవిగాదు. అంతలా వేళ్ళూనుకుపోయిందీ విషవృక్షం . రాజకీయాల్లో అయితే ఇక చెప్పేదేముంది. కొండలా పెరిగిపోయింది. ఈ సమస్యతో సామాన్యుడి నుంచి మాన్యుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఇప్పుడు దీనికో పరిష్కారం ఉందంటున్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. ఉద్యోగుల తరహాలోనే రాజకీయనేతలకూ కార్పొరేట్ జీతాలిస్తే సరి అంటున్నారు. అప్పుడు కాసుల కోసం అడ్డదారులు తొక్కే అగత్యం వారికి తప్పుతుందని సూత్రీకరించారు.
పనాజిలో జరిగిన ఓ సదస్సులో 'అవినీతి రహిత ప్రభుత్వం' అన్న అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. భారీ మొత్తాల్లో వేతనాలివ్వడమే కాకుండా, వారి పనితీరును బట్టి ప్రోత్సాహకాలనూ ఇవ్వాలని ఆయన సూచించారు. మరి, నారాయణ మూర్తి సలహాలు, సూచనలు నేతలకు ఆమోదయోగ్యమవుతాయో.. తద్వారా అమల్లోకి వస్తాయో.. వేచి చూడాలి.