: విటమిన్ సి, ఇ సప్లిమెంట్లతో కండరాల దారుఢ్యం దెబ్బతింటుంది


విటమిన్ సి, ఇ లోపంతో బాధపడేవారికి ఇంత కాలం వైద్యులు సప్లిమెంట్స్ వాడాలని సలహా ఇవ్వడం తెలిసిందే. అయితే, అదే పనిగా ఈ సప్లిమెంట్స్ వాడితే దుష్ఫలితాలు కలుగుతాయని తాజా పరిశోధనల్లో తేలింది. విటమిన్ సి, ఇ సప్లిమెంట్స్ వాడటం వల్ల కండరాల దారుఢ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వ్యాయామం చేసేవారు, క్రీడాకారులు ఈ సప్లిమెంట్లు ఉపయోగించినప్పుడు కండరాల సామర్థ్యం తగ్గి, కణాల సర్దుబాటు దెబ్బతింటున్నదని శాస్త్రవేత్త గొరాస్ పాల్సెస్ తెలిపారు. శ్రమను, బాధను భరించే శక్తి కండరాలకు కలుగకుండా సప్లిమెంట్లు నిరోధిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను ‘నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్’ తరఫున చేసిన పరిశోధనలో గుర్తించామని ఆయన చెప్పారు.

లండన్ లోని 54 మంది యువతపై గొరాస్ బృందం పరిశోధనలు జరిపింది. ఆ సమయంలో కొందరికి 1000 ఎంజీ విటమిన్ సి సప్లిమెంట్లు, మరికొందరికి 235 ఎంజీ విటమిన్ ఇ సప్లిమెంట్లు ఇచ్చారు. ఇంకొందరికి ఇవేమీ ఇవ్వకుండా మొత్తం 11 వారాల పాటు వారందరినీ పరిశీలించిన అనంతరం వారికి దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. విటమిన్ సి, ఇ సప్లిమెంట్లు వాడిన వారిలో కండరాల సహన శక్తి తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సప్లిమెంట్లు వాడిన వారిలో కండరాలకు శక్తినిచ్చే మైటోకాండ్రియాలు అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని ఈ పరిశోధనల్లో తేలింది.

  • Loading...

More Telugu News