: గత జన్మ ప్రేమికులమంటూ యువతిని వేధిస్తున్న బాస్
అతడి పేరు పరమేశ్వర్రావు (56). అతని కుమారుడు చంద్ర ఓ సాఫ్ట్ వేర్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం చంద్ర సింగపూర్లో ఉండడంతో పరమేశ్వర్రావు సాఫ్ట్ వేర్ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. ఈ సంస్థలో కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ యువతి (23) హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తోంది. పరమేశ్వర్రావు కన్ను ఈ ఉద్యోగినిపై పడింది. అప్పటి నుంచి ఆమెకు పలు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు.
'మనం గత జన్మ ప్రేమికులం.. ఇప్పుడు కలిసిపోదాం' అని సినిమాటిక్ గా దగ్గరయ్యేందుకు యత్నించసాగాడు. అంతేగాకుండా, తన సెల్ ఫోన్ లోని అశ్లీల చిత్రాలను ఆమెకు చూపి లోబరుచుకునే యత్నాలకు తెరదీశాడీ కామాంధుడు. విధులు ముగిసిన తర్వాత తన కార్లోనే రావాలని బలవంతం చేయడం, అందరూ చూస్తుండగానే కార్లోకి లాగడం వంటి చేష్టలతో అతగాడి కాముకత పరాకాష్ఠకు చేరింది. బాస్ ప్రవర్తన భరించలేని యువతి వారం కిందట ఉద్యోగానికి రాజీనామా చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పరమేశ్వర్రావు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.