: ‘జగన్ వదిలిన బాణం’ విశాఖ ఎన్నికల్లో నిలవనుందా?
వైఎస్సార్సీపీ అధినేత ‘జగన్ వదిలిన బాణం’గా చెప్పుకునే ఆయన సోదరి షర్మిల, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నారా?.. ఈ ప్రశ్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం మేరకు అవుననే సమాధానం వస్తోంది. కేంద్రంలో పార్టీ తరఫున చక్రం తిప్పడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరు పార్లమెంటులో ఉండాలని ఆ కుటుంబం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తన అన్న జగన్ వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నందున లోక్ సభ స్థానం పోటీ చేయాలని షర్మిల ఆలోచిస్తున్నారు. ముందుగా కడప నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. ఆ స్థానాన్ని జగన్ తన దూరపు బంధువైన అవినాశ్ రెడ్డి కోసం వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షర్మిల పోటీ చేసేందుకు విశాఖపట్నం ‘సురక్షిత’మని పార్టీ భావిస్తోంది.
విశాఖ లోక్ సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పురంధరేశ్వరి, సుబ్బరామిరెడ్డి ఉన్నారు. అయితే, ఇప్పుడు సుబ్బరామిరెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున.. ఇప్పుడు ఆ స్థానంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ పడే సామర్థ్యం గల బలమైన అభ్యర్థులెవరూ లేరు. అందుకే, ఇప్పుడు షర్మిలను విశాఖపట్నం నుంచి పోటీకి దింపాలని వైఎస్సార్సీపీ యోచిస్తోంది.