: అగస్టా వెస్ట్ ల్యాండ్ వ్యవహారంలో ప్రణబ్, మన్మోహన్, సోనియా పేర్లు
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం ఇటీవలే దేశ రాజకీయ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపి చల్లబడింది. ఈ ఒప్పందాన్ని రక్షణశాఖ రద్దు చేసి చేతులు దులిపేసుకుంది. కానీ, అందులో సోనియా పేరు బయటకు రావడంతో మరోసారి కలకలం రేపుతోంది. ఈ హెలికాప్టర్లను భారత్ కు సరఫరా చేసే కాంట్రాక్టును పొందే విషయంలో మధ్యవర్తిత్వం వహంచిన వ్యక్తి వెల్లడించిన విషయాలే వివాదానికి కారణం. అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ హెలికాప్టర్ల సరఫరా విషయమై భారత్ లోని అధికారులకు వందల కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్లు వెల్లడికావడంతో ఇటలీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇటలీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీటులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ గురించి పేర్కొన్నారు. ఇతడు భారత్ లోని అగస్టా కార్యాలయంలో పనిచేసే పుల్లెట్ అనే వ్యక్తికి పంపిన లేఖను కూడా దర్యాప్తు అధికారులు సేకరించారు. కాంట్రాక్టు రాబట్టడం కోసం తనను భారత్ లోని సోనియా సన్నిహితులతో మంతనాలు నెరపమన్నారని మిచెల్ ఆ లేఖలో పేర్కొన్నారు. సోనియా సన్నిహితులుగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, వీరప్ప మొయలీ, ఎంకే నారాయణ్ తదితరులు ఉన్నారు. సోనియా పేరు బయటకు రావడంతో పార్లమెంటు సమావేశాల్లో దీనిపై అధికార పక్షాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది.