: ఆందోళనను కలిగించే కొత్త భాగాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
ఆందోళనను విశ్లేషించుకునే ప్రక్రియలో మన మెదడులోని అమీగ్దలతో పాటు మరో భాగానికి సంబంధం ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకు ఆందోళన, భయం కలగటంలో కీలక పాత్ర వహించే అమీగ్ధల పైనే గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. అయితే కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు లాటెరల్ సెఫ్టమ్ (ఎల్.ఎస్) అనే భాగంపై అధ్యయనం చేశారు. మెదడులోని ఇతర భాగాలతో అనుసంధానం చేసే నాడీవ్యవస్థ నేరుగా ఆందోళనను ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒత్తిడి మూలంగా ఆందోళన కలిగినప్పుడు ఎల్ఎస్ లోని నాడీ కణాలు ఉత్తేజితమయ్యాయని వారు తెలిపారు. ఈ నాడీకణాలు కొద్దిగా ఉత్తేజితమైనా.. అరగంట పాటు ఆందోళన స్థితి కొనసాగుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఆందోళన ఆరంభ దశలో ఈ నాడీకణాలు పాలు పంచుకుంటున్నట్టు, ఈ కణాలు సాధారణ స్థితికి తిరిగి వచ్చిన తర్వాత ఆందోళన కొనసాగుతున్నట్టు వెల్లడైందని వారు చెప్పారు. ఈ నాడీకణాలకు మెదడులోని పారా వెంట్రిక్యులార్ న్యూక్లియన్ (పీవీఎన్)తో సంబంధం ఉన్నట్టు తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.