: ఆశారాం బాపు ఆస్తిపాస్తులు రూ.10 వేల కోట్లు..!
ఆ స్వామీజీ ఆస్తిపాస్తుల విలువ తెలిసి ఇప్పుడు బడా బడా కార్పొరేట్ సంస్థలే ఆశ్చర్యపోతున్నాయి. ఆశారాం బాపు ఆస్తుల విలువ.. అక్షరాలా 10 వేల కోట్ల రూపాయలని తెలుస్తోంది. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు వెలుగు చూస్తోంది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు ప్రస్తుతం జోథ్ పూర్ జైల్లో ఉన్న విషయం విదితమే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలులో ఉన్నారు.
ఆశారాం బాపు ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సందర్భంలో లభించిన విలువైన పత్రాలను పరిశీలించగా, బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము 9 వేల కోట్ల రూపాయల పైగానే ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా మీడియాకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదని కమిషనర్ చెప్పారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని ఆయన తెలిపారు. ఆశారాం బాపుకు గుజరాత్ రాష్ట్రంలో 45 ప్రాంతాల్లో భూములున్నాయని ఆయన చెప్పారు. అలాగే, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా ఆయన భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ వెల్లడించారు.