: ఒకే ఒక్క పరీక్షతో ముందుగానే మధుమేహ నిర్ధారణ!
ఒకే ఒక్క పరీక్షతో కాస్త ముందుగానే మధుమేహ నిర్ధారణ చేయవచ్చని టెల్ అవీవ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా టైప్-2 మధుమేహ వ్యాధి నిర్ధారణకు ఏ1సీ పరీక్షను ఉపయోగిస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం ఏ1సీ స్థాయులు 6.5 శాతంగాని, అంతకంటే ఎక్కువగాని ఉంటే మధుమేహ వ్యాధిని సూచిస్తుంది. అదే 5.7 నుంచి 6.4 శాతం మధ్యలో ఉంటే వ్యాధి వచ్చే అవకాశానికి సంకేతం. ఈ పరీక్ష మధుమేహ వ్యాధికి బయోమార్కర్ లా ఉపయోగపడుతుంది. అయితే వ్యాధి నిర్ధారణకు తినకముందు, తిన్న తర్వాత రెండుసార్లు పరీక్ష చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఈ పధ్ధతి ద్వారా ఒక్కసారి ఏ1సీ పరీక్షను చేసి ముందుగానే వ్యాధి నిర్ధారణ చేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ నటాలీ లెర్నర్ తెలిపారు.