: తడబడి నిలబడిన భారత్... 278/5 (50 ఓవర్లు)


హామిల్టన్ లో న్యూజీలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 278 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రారంభంలో తడబడినప్పటికీ... చివర్లో ధోనీ, జడేజాల బ్యాటింగ్ పటిమతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఓపెనర్లుగా వచ్చారు. అయితే, కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ సౌతీ బౌలింగ్ లో నీషమ్ కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. తర్వాత బరిలోకి దిగిన రహానే కూడా 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిల్స్ బౌలింగ్ లో సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హైదరాబాదీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు రోహిత్ శర్మకు జతకలిశాడు. వీరిద్దరు కలసి భారత స్కోరును పెంచారు. జట్టు స్కోరు 101 పరుగుల వద్ద అంబటి రాయుడు 37 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి బెన్నెట్ బైలింగ్ లో రోంచీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తర్వాత కెప్టెన్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో 79 పరుగులు (6ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన రోహిత్ శర్మ విలియమ్ సన్ బౌలింగ్ లో రోంచీ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత బరిలోకి దిగిన అశ్విన్ 5 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో లాస్ట్ మ్యాచ్ హీరో జడేజా ధోనీకి జతకలిశాడు. వీరిద్దరూ కలసి స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ధోనీ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేశాడు. జడేజా 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. దీంతో, నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు సాధించింది. న్యూజీలాండ్ బౌలర్లలో సౌతీ (2), మిల్స్, బెన్నెట్, విలియమ్ సన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ విజయం సాధించాలంటే 279 పరుగులు చేయాలి.

  • Loading...

More Telugu News