: అధిష్ఠానం కుట్రతోనే సీఎం వ్యవహారం.. నా అభిప్రాయం చెప్పకుండా కుట్ర: బాబు
తనపై కక్షతోనే కాంగ్రెస్ అధిష్ఠానం కుయుక్తులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం ఆదేశాల మేరకే సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాసనసభలో తన అభిప్రాయం చెప్పనీయకుండా కుట్ర పన్ని సభను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఆ తరువాత ఢిల్లీలో తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను కలవగానే తాము చేతులు కలుపుతామేమోనని భయపడి హడావుడిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు బెయిలిచ్చారని ఆయన అన్నారు.
తరువాత గుజరాత్ లో తాను మోడీని కలవగానే కేంద్ర మంత్రి వర్గం రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేసిందని బాబు గుర్తు చేశారు. ఎన్డీయే సుస్థిర పాలన వెనుక ఉన్నాననే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద కక్షగట్టిందని ఆయన మండిపడ్డారు. తెలుగు ప్రజలలో విద్వేషాలు రేపారని బాబు విమర్శిచారు. కేవలం టీడీపీని లక్ష్యం చేసుకునే అన్ని పార్టీలు పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు, సీమాంధ్రలో జగన్ పార్టీతో పొత్తు కేవలం టీడీపీని ఎదుర్కొనేందుకేనని బాబు స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు.