: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రెబల్ ఎమ్మెల్యే బహిష్కరణ
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని ఆ పార్టీ నుంచి బహిష్కరించింది. కేజ్రీవాల్ పై, ఆయన ప్రభుత్వంపై మీడియా వద్ద విమర్శలు చేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పార్టీ క్రమశిక్షణ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బిన్నీని బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. విద్యుత్తు, తాగునీటి చార్జీలు తదితర అంశాల్లో పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను కేజ్రీవాల్ విస్మరిస్తున్నారని, ఆయన నియంత అనీ బిన్నీ ఇటీవల మీడియా ముందు తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన తమ పార్టీలో చేరతానంటే ఆహ్వానిస్తామని బీజేపీ ప్రకటించింది.