: వందలాది ఉస్మానియా విద్యార్థులు నక్సలైట్లుగా ఎందుకు మారారు?: రేవంత్ రెడ్డి
వందల మంది తెలంగాణ విద్యార్థులు నక్సలిజం వైపు వెళ్లడానికి ఆంధ్ర పాలకుల హింస కారణం కాదా? అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఆయన శాసనసభలో ఈ ఉదయం మాట్లాడారు. తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందన్నారు. ఒప్పందంలో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో భాగమయ్యాయని చెప్పారు. కానీ, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆదిలోనే తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఖమ్మంలో ఉద్యమం లేదనే వారికి.. 1969లో తెలంగాణ ఉద్యమం అదే జిల్లాలో పుట్టిన సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. నాడు 369 మంది విద్యార్థులు అమరులయ్యారని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగమే సరికాదన్నారు. అలా అయితే, ఒడిశాలోని బరంపురం, కర్ణాటకలోని బళ్లారి ప్రజలు మన రాష్ట్రంలో ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాలే హింసకు పాల్పడ్డాయి కానీ, ఉద్యమకారులు కాదన్నారు. తెలంగాణ పోరాటానికి సహకరించిన సీమాంధ్ర మిత్రులను గౌరవిస్తామని అన్నారు.