: సల్మాన్ ని భిన్నంగా చూపించిన 'జై హో'!
నటుడు సల్మాన్ ఖాన్ తన రెండవ ఇన్నింగ్స్ లో దాదాపు ప్రజాదరణ పొందిన చిత్రాలే చేశాడు. అందులో కొన్ని రీమేక్ చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న పోకిరి (వాంటెడ్), రెడీ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సల్మాన్ కు బాగానే పేరు తెచ్చాయి. అదే ఆలోచనతో ఈసారి తెలుగులో ఆరేళ్ల కిందట చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రాన్ని ఎంచుకున్నాడు. 'నువ్వు ఒకరికి సహాయం చేస్తే ఆ ఒకరు మరో ముగ్గురికి, వారు మరో ముగ్గురుకి సహాయం చేయాలి' అనేదే ఈ చిత్రం కథాంశం. అక్కడే సల్మాన్ ఈ చిత్రం మాయలో పడ్డాడు. స్వతహాగా సహాయం చేసే అలవాటున్న తనకి ఈ కథ బాగా సూటవుతుందని తమ్ముడు సోహైల్ ఖాన్ కి దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను అప్పగించాడు. అలా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక కథలోకి వెళితే.. మిలటరీ నుంచి సస్పెండైన జై (సల్మాన్) అనే ఓ మాజీ మిలటరీ ఆఫీసర్ సమాజంలోని చెడును అరికట్టేందుకు పోరాడుతుంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అన్యాయాన్ని ఎదిరించడం చేస్తుంటాడు. తనెవరికి సహాయం చేసినా తిరిగి సాయం కోరకుండా, మరో ముగ్గురికి సాయం చేయమని వారిని కోరుతుంటాడు. అదే తన లక్ష్యమని చెబుతుంటాడు. ఇందులో భాగంగానే హోం మంత్రి (డానీ)తో గొడవ వస్తుంది. అతడి అక్రమాలను ఎదుర్కొనే నేపథ్యంలో, ముఖ్యమంత్రిని చంపేందుకు జై కుట్ర పన్నినట్లు అపవాదు పడుతుంది. ఈ క్రమంలో హోంమంత్రికి, జైకు మధ్య ఘర్షణలు, అతడి అనుచరులతో ఫైటింగ్... ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సల్మాన్ నటన అభిమానులను ఆకట్టుకుంటుంది.
అంతకుముందు చిత్రాలకు భిన్నంగా ఎంచుకున్న కథలో సల్లూ పాత్రని తీర్చిదిద్దడం బాగానే ఉంటుంది. ఇలాంటి కథకు దగ్గరలో వచ్చిన చిత్రాలను గతంలో బాలీవుడ్ ప్రేక్షకులు చూసినప్పటికీ సల్మాన్ హీరో అవడంతో ఆసక్తి చూపించవచ్చు. అయితే, చాలా సరదా పాత్రల్లో, రొమాంటిక్ గా సల్మాన్ ను చూసిన హిందీ ప్రేక్షకులు ఇందులో అంగీకరించక పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వరుస పెట్టి పెద్ద పెద్ద డైలాగులు, చిన్నపాటి ఉపన్యాసాలలో పాత్ర పరిధికి, పటిష్ఠతకు న్యాయం చేకూర్చిన సల్మాన్.. ఆ పాత్రలో జనాలను మెప్పిస్తాడా? అనేది ప్రశ్నగా మిగిలింది.
సాధారణంగా ఫ్యాషన్, రొమాంటిక్, ఓవర్ కామెడీ, వాస్తవ కథలతో తెరకెక్కించే చిత్రాలకే పట్టం కట్టే బాలీవుడ్ అభిమానులు దీనిపై అంతగా మొగ్గు చూపుతారా? అనేది మరో సందేహం. ఈ మధ్య బాలీవుడ్ లో వచ్చిన మరో ట్రెండు.. వంద కోట్లు, రెండొందల కోట్ల క్లబ్. కథ ఎలా ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించిందనేది ప్రధానంగా మారింది. మరి దీన్ని లెక్కలోకి తీసుకుంటే సల్లు చిత్రం ఆ క్లబ్బులోకి వెళుతుందో! లేదో! తెలియదు.
ఈ చిత్రంలో ఉన్న కొన్ని ప్రధాన పాత్రలు చూస్తే... హీరోయిన్ గా పరిచయమైన డైసీ షా. నృత్యకారిణి స్థాయి నుంచి కథానాయికగా ఎదిగిన ఆమె తొలి హిందీ చిత్రం ఇది. సల్మాన్ సరసన చేయడమంటే డైసీకి అదృష్టమే. అయితే, పాటలు, డ్యాన్సులు, చిన్న సన్నివేశాలకే ఆమె పరిమితమైంది. నటనపరంగా అయితే, అంతగా అవకాశం లేదని, గ్లామర్ పరంగానూ అంత గొప్పగా లేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇందులో మరో ముఖ్య పాత్ర సల్మాన్ అక్కగా చేసిన టబు. తన పరధి మేరకు నటించి ఓకే అనిపించింది. మరో పాత్ర అంగవైకల్యంతో బాధపడే జెనీలియా. కనిపించేది కొద్దిసేపే అయినా మంచి మార్కులే పడ్డాయి. ఇక చిత్రంలో డానీ విలనిజం, సునీల్ శెట్టి, మహేశ్ మంజ్రేకర్, సనాఖాన్ తదితరుల పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. చిత్రానికి పాటలు కొంత ఆకర్షణ.
గతంలోలా సల్మాన్ కు ఈ రీమేక్ చిత్రం కలసిరాలేదని, అంచనాలు తలకిందులు అయ్యాయని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. తెలుగులో విజయం సాధించిన 'స్టాలిన్' కథ బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందన్నదే డౌటు!