: చెంపదెబ్బ కేసులో గోవిందాకు కష్టాలు
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బాలీవుడ్ హీరో గోవిందాపై ఛార్జిషీటు దాఖలు చేయాలని ముంబయిలోని బోరేవిలి సబర్బన్ కోర్టు ఈరోజు పోలీసులను ఆదేశించింది. 2008లో తనను ప్రశ్నించాడని ఓ వ్యక్తిని గోవిందా ఫిల్మ్ సెట్లో చాచిపెట్టి ఒక్కటిచ్చుకున్నాడు. ఇప్పుడా కేసులో గోవిందాపై సెక్షన్ 352, 323,506 కింద చార్జిషీటు దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
2008లో గోవిందా హీరోగా నటిస్తున్న'మనీ హై తో మనీ హై' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో గోవిందా ఉత్తర ముంబయి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి రామ్ నాయక్ పై గెలిచారు. అయితే, సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూ నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేశారని ఓ వ్యక్తి ప్రశ్నించడం గోవిందాని ఆగ్రహానికి గురిచేసింది.
'మీరు నియోజకవర్గంలో ఎందుకు కనిపించరు?' అని ఆ వ్యక్తి అడిగాడో, లేదో గోవిందా అతని చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్లో ఆ సంఘటనపై గోరేగావ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, తాజాగా కోర్టు గోవిందాపై ఛార్జిషీటు దాఖలు చేయమన్న నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 24న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. దోషిగా నిరూపితమైతే గోవిందాకు నాలుగేళ్ల జైలుశిక్ష పడుతుంది.