: అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు: జగన్ పై నామా విమర్శలు
తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే జగన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆయన మాట్లాడుతూ, కూకట్ పల్లిలో మధుకాన్ కంపెనీకి ఇచ్చిన భూమి బహిరంగ వేలంలో దక్కించుకున్నదని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉన్నది రాజశేఖరరెడ్డి అని, అత్యధిక బిడ్ వేసిన తనకు న్యాయబద్ధంగా ఆ భూమి వచ్చిందని అన్నారు. 'దమ్ముంటే నీ ఆస్తులపై, నా ఆస్తులపై బహిరంగంగా చర్చిద్దాం రా'.. అంటూ జగన్ కు నామా సవాలు విసిరారు.
43 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీబీఐ చెబుతుంటే, ఇంతవరకు తాము తప్పు చేయలేదని ప్రజలకు చెప్పలేకపోయిన మీరా మమ్మల్ని విమర్శించేది? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో ఎన్ని సెక్షన్లపై శిక్షలు ఉన్నాయో అవన్నీ నమోదైన జగనా తమపై విమర్శలు చేసేది? అని ప్రశ్నించారు. అన్యాయంగా సంపాదించిన ఆస్తులతో పేపర్, టీవీ పెట్టి, కరపత్రం చేసుకున్న జగన్ కు నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు. ఇంకా తనపైనా, చంద్రబాబుపైనా అసత్య వార్తలు రాయాలనుకుంటే జగన్ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసి.. మీడియా సాక్షిగా చర్చించి అప్పుడు రాసుకోవచ్చని సూచించారు.