: హైదరాబాదులో 108 అంబులెన్సుల దారి మళ్లింపు
హైదరాబాదు నాంపల్లిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చే సందర్శకులతో ప్రతిరోజూ నాంపల్లి నుంచి మొజంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్)కు వెళ్లే రోడ్డుపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు హాస్పిటల్, 108 అంబులెన్స్ వంటి అత్యవసర సర్వీసులను దారి మళ్లించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అంబులెన్సులు, అత్యవసర సర్వీసులకు దారి మళ్లింపు వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 108 వాహనాలు మొజంజాహి మార్కెట్ మీదుగా అబిడ్స్, జనరల్ పోస్టాఫీస్, నాంపల్లి స్టేషన్ రోడ్ మీదుగా పబ్లిక్ గార్డెన్స్ కు వెళ్లాల్సిందిగా వారు సూచించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఎగ్జిబిషన్ జరగనున్న నేపథ్యంలో.. అప్పటి వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.