: అవిశ్వాసంలో టీడీపీ అండతో గట్టెక్కిన సర్కారు
రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శాసనసభలో వీగిపోవడంతో సర్కారు ఊపిరి పీల్చుకుంది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓటింగు సమయంలో టీడీపీ తటస్థంగా వ్యవహరించడం వల్లే, ఈ తీర్మానాన్ని గెలిచి సర్కారు పెద్ద కష్టం నుంచి గట్టెక్కింది.
నిన్న ఉదయం నుంచి అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో వాడి వేడిగా ... ఆరోపణలు .. ప్రతి ఆరోపణలతో ... సవాళ్లు ... ప్రతిసవాళ్ళతో సభ్యుల మధ్య చర్చ జరిగింది. కొందరు సభ్యులు సహనం కోల్పోయి ప్రవర్తించడం కూడా జరిగింది.
చర్చ అనంతరం రాత్రి ఒంటి గంట తర్వాత ఓటింగు పెట్టగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 58 ఓట్లు, ప్రతికూలంగా 142 ఓట్లు రావడంతో తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్ కు చెందిన 9 మంది, టీడీపీకి చెందిన 7 మంది తమ పార్టీ విప్ ను ధిక్కరించడం జరిగింది. నాగం జనార్ధనరెడ్డి, జయప్రకాశ్ నారాయణతో బాటు, మజ్లిస్ సభ్యులు కూడా ఓటింగులో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు.
కాగా, పార్టీల విప్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన సభ్యులపై కాంగ్రెస్, టీడీపీలు అనర్హత వేటు వేసే యోచనలో వున్నాయి. ఇదిలా ఉంచితే, కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిపోయినప్పటికీ, నిబంధనల ప్రకారం మరో ఆరు నెలల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలులేదు