: జేపీ ప్రసంగమా మజాకా.. !


రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన, సమాజ భవిష్యత్ పట్ల నిర్దిష్ట ప్రణాళిక ఉన్న ఎమ్మెల్యేల్లో లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అగ్రగణ్యులు. ఆయన మాట్లాడితే, సభలో స్పీకర్ సమయాభావం అవుతున్నా గుర్తించలేని స్థితికి చేరుకుంటారు. సహచర ఎమ్మెల్యేలు అలా నోరప్పగించి చూస్తుంటారు. ఆయన లేవనెత్తే అంశాలపై ఏమీ అనలేక అధికార, విపక్ష నేతలు మౌనాన్నిఆశ్రయిస్తారు.

ఇక ఉక్రోషం ఆపుకోలేక ఎవరైనా ఆయన్ని ఖండిస్తే, దాన్నీ దీటుగా తిప్పికొట్టడం ఆయనకే చెల్లు. ఈ రోజు అసెంబ్లీలో అదే జరిగింది. జేపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలన లేదని విమర్శించారు. రోజుకోమాట, గంటకోమాట చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రలో దోషిగా నిలబడే రోజొస్తుందని ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

పార్టీలు, సభ్యులు పద్దతి మార్చుకోకపోతే రాష్ట్రంలో సంక్షోభం మరింత ముదురుతుందని  హెచ్చరించారు. ఓట్ల కొనుగోలులో ఆరితేరిన రాష్ట్రం ప్రజలను ఓటు యంత్రాలుగానే పరిగణిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు మందుకు, నోటుకు ఓట్లు వేసే స్థితి వచ్చిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో సీఎం కిరణ్ జోక్యం చేసుకుని, 'రాష్ట్రంలో మీరొక్కరే మేధావులని  అనుకోవద్దు' అని జేపీనుద్ధేశించి వ్యాఖ్యానించారు.

అలా మాట్లాడి ప్రజలను కించపరచవద్దని హితవు పలికారు. ఇక జేపీ అందుకుంటూ, ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఏ ఓటరుకైనా తానొక్క రూపాయైనా ఇచ్చానని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

అంతకుముందు  ఇకనైనా మేలుకోకపోతే రాష్ట్రం అధోఃగతి పాలవడం ఖాయమంటూ జేపీ ఓ చిన్నకథను వినిపించారు. ఆ కథేంటే ఆయన మాటల్లోనే.. 'నాజీలు మొదట యూదుల కోసం రాగా ఓ వ్యక్తి తాను యూదుణ్ని కాదనుకుంటాడు. అనంతరం నాజీలు కమ్యూనిస్టుల కోసం రాగా ఆ వ్యక్తి తాను కమ్యూనిస్టును కాదనుకుంటాడు.

తర్వాత నాజీలు సామాన్య ప్రజల కోసం వస్తారు. అయితే ఆ వ్యక్తి తాను సామాన్యుణ్ణి కాదనుకుంటాడు. చివరిగా నాజీలు ఆ వ్యక్తి కోసమే వస్తారు. అప్పుడు భయపడిన ఆ వ్యక్తి చుట్టూ చూసుకుంటే ఎవరూ మిగలరు' అని ముగిస్తూ.. ఇప్పుడైనా ప్రతి ఒక్కరూ కళ్లు తెరవాలని, సమాజాన్ని ప్రక్షాళన చేయాలని జేపీ పిలుపునిచ్చారు.


  • Loading...

More Telugu News