: వెండితెర అభినయ సౌందర్యం... అంజలీ దేవి!
అలనాటి సీత అంజలీదేవి (86) కన్నుమూశారు. సీత పాత్రలతో సినీ అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన అంజలీదేవి మరణ వార్త ఇటు అభిమానుల్ని, అటు చిత్ర పరిశ్రమను విచారంలో ముంచేసింది. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో... సీత పాత్రలో అంజలీదేవి కూడా అంతే పేరు సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో అంజలీదేవి జన్మించారు. అంజలీ దేవి అసలు పేరు అంజనమ్మ. సినిమాల్లోకి రాకముందు ఆమె రంగస్థల నటిగా రాణించారు. రంగస్థల నటిగా ఆమె పేరును అంజని కుమారిగా మార్చారు. తర్వాత దర్శకులు సి.పుల్లయ్య ఆమె పేరును అంజలీ దేవిగా మార్చారు.
అంజలీదేవి నటించిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. ఈ సినిమాను 1936లో నిర్మించారు. అయితే అంజలీదేవికి హీరోయిన్ గా మొదటి ఛాన్స్ ఇచ్చింది మాత్రం ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్. 1940లో ఆయన నిర్మించిన కష్టజీవి సినిమాలో అంజలీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మూడు రీళ్లు తీసిన తర్వాత ఆగిపోయింది. అయితే సి.పుల్లయ్య ఆమెకు హీరోయిన్ గా మరో అవకాశం ఇచ్చారు. తాను నిర్మించిన గొల్లభామ (1947) సినిమాలో అంజలికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. తన అందం, అభినయంతో అంజలీదేవి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయారు. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 350కి పైగా తెలుగు సినిమాలు, మరికొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సువర్ణ సుందరి చిత్రం హిందీలో కూడా హిట్ అవడంతో... అంజలీ దేవి జాతీయ స్థాయిలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
1940లో సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావుతో అంజలీదేవికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. భర్తతో కలసి అంజలీదేవి అంజలీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. 1955లో తమ సొంత బ్యానర్ లో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు. అలాగే భక్తతుకారాం, చండీప్రియా తదితర సినిమాలను నిర్మించారు.
అంజలీదేవి నటనా ప్రతిభకు ఆమెను వరించిన అవార్డులే కొలమానాలు. ఆమె నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. అనార్కలి (1955), సువర్ణ సుందరి (1957), చెంచు లక్ష్మి (1958), జయభేరి (1959) సినిమాలకు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. వరుసగా మూడేళ్లు ఫిలింఫేర్ అవార్డుల్ని సాధించారంటే... ఆమె నటన, అభినయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2005లో తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆమెను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించారు. 2006లో రామినేని అవార్డుతో గౌరవించారు. 2008లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించారు. దేవకన్య, దేవత, గ్రామీణ మహిళ, తల్లి, దయ్యం, డ్యాన్సర్, యువతిలాంటి అన్ని పాత్రల్లో నటించి, మెప్పించారు అంజలీదేవి.
అంజలీ దేవి నటించిన చిత్రాల్లో లవకుశ, సతీ సావిత్రి, చెంచులక్ష్మి, సతీ అనసూయ, రాజపుత్ర రహస్యం, జయభేరి, భక్త ప్రహ్లాద, బడిపంతులు, సోగ్గాడు, అనార్కలి, నిరపరాధిలాంటి అద్భుతాలెన్నో ఉన్నాయి. 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమాలో ఆమె రాక్షసి పాత్ర పోషించారు. ఈ పాత్ర పోషించడానికి ఆమెకు అప్పట్లోనే 30 వేల రూపాయల పారితోషికం ఇచ్చారంటే... ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేసి, సినీ రంగానికి అలుపెరుగని సేవచేసిన అంజలీదేవి మరణం... సినీపరిశ్రమకు తీరని లోటే.