: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు వేకువజామున ఒంటిగంటకు వైకుంఠద్వారాన్ని ఆలయ అర్చకులు తెరిచారు. దేశవ్యాప్తంగా తరలి వచ్చిన ప్రముఖులకు శ్రీవారి దర్శనం కల్పించిన అనంతరం, ముక్కోటిద్వార ప్రవేశానికి అనుమతించారు. వీఐపీల దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటలవరకు సమయాన్ని కేటాయించారు. అనంతరం సర్వదర్శనం, కాలినడకన వచ్చి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలనుంచి దర్శనానికి అనుమతించారు. ధర్మదర్శనానికి, దివ్య దర్శనానికి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద పథకాన్ని టీటీడీ ఈరోజు ప్రారంభించింది. ఇక తిరుపతిలో విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవనిలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తారు.