: మాట్లాడితేనే మాటలొస్తాయట!
'మా పిల్లలు ఒట్టి వాగుడుకాయలు... ఒకటే వాగుతుంటారు' అని కొందరు తల్లిదండ్రులు చెబుతుంటే... 'మా పిల్లలు అస్సలు మాట్లాడరు. ఏడాదిన్నర వయసు వస్తున్నా మా బాబుకు సరిగా మాటలు రావడం లేదు' అని వాపోయే తల్లిదండ్రులు కూడా మనకు కనిపిస్తుంటారు. అయితే పిల్లలు బాగా మాట్లాడాలంటే... ముందుగా వారికి మాటలు అనేవి తెలియాలి. అవి తెలియాలంటే మనం వారితో మాట్లాడాలి. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. తల్లిదండ్రులు తమకు వీలైనప్పుడల్లా పిల్లలతో సంభాషిస్తుండాలట. అప్పుడే వారిలో మాటలు నేర్చుకునే సామర్ధ్యం పెరుగుతుందని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
వాషింగ్టన్, కనెక్టికట్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఏడాది, రెండేళ్ల వయసున్న చిన్నారులు తమ తల్లిదండ్రులు తమతో నేరుగా మాట్లాడే పదాలనే ఎక్కువగా, త్వరగా నేర్చుకుంటారని తేలింది. కొన్ని కుటుంబాల్లో పిల్లలతో అవసరం ఉంటేగానీ మాట్లాడరట. ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు మాటలు రావడం కాస్త కష్టమని, వారికి మాటలు తేలికగా రావని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు... ఇలాంటి పిల్లలకు భావప్రకటన స్థాయి కూడా తక్కువగానే ఉంటుందట.
ఈ విషయంపై పరిశోధకులు 26 కుటుంబాలపై పరిశోధనలు సాగించారు. తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడే కుటుంబాల్లో రెండేళ్ల వయసుగల పిల్లలకు సగటున 433 పదాలు వస్తుంటే, మాట్లాడకుండా మూతి ముడుచుకుని ఉండే తల్లిదండ్రులు ఉన్న ఇళ్లలోని పిల్లలకు కేవలం 169 పదాలు మాత్రమే వస్తున్నాయట. కాబట్టి చక్కగా మీ చిన్నారులతో మాట్లాడండి. దానివల్ల వారికి చక్కగా మాటలు వస్తాయి. మరో ముఖ్య విషయం ఏమంటే... మీరు మీ పిల్లలతో మాట్లాడే సమయంలో పక్కన ఎవరూ లేకుండా కూడా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.