: అసెంబ్లీలో నవ్వులు పూయించిన హరీష్ పిట్టకథ


రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన 'మాట్లాడే చిలుక' పిట్టకథ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. కాంగ్రెస్ సర్కారు విద్యుత్ సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని చూస్తున్నారని ఆయన విమర్శిస్తూ ఈ కథను ఉదహరించారు.

ఆ కథేంటో హరీష్ మాటల్లోనే.. 'ఓ ఉద్యోగి ఏవో వస్తువులు తేవడానికి బజారుకు వెళతాడు. అక్కడ ఓ వ్యక్తి చిలుకలు అమ్ముతుంటే అతని వద్దకు వెళతాడు. ఆ చిలుకల వ్యాపారి ఉద్యోగికి ఓ చిలుకను చూపించి 'ఇది మాట్లాడే చిలుక సార్' అని చెబితే వెంటనే దాన్ని కొని ఇంటికి తీసుకువస్తాడా ఉద్యోగి. ఆ చిలుకను, మిగతా వస్తువులను భార్యకు ఇచ్చి వెంటనే స్నానం చేసి ఆఫీసుకు వెళ్లిపోతాడు.

అయితే, అది మాట్లాడే చిలుక అని భార్యకు చెప్పడం మరిచిపోతాడు ఆ ఉద్యోగి. సాయంత్రం రాగానే అతనికి భార్య వేడివేడిగా నాన్ వెజ్ వడ్డిస్తుంది. 'నేనేమీ ఉదయం మాంసం తేలేదే' అని ఆ ఉద్యోగి భార్యను ప్రశ్నిస్తాడు. 'అదేంటండీ మీరు చిలుకను తెచ్చారు కదా' అని ఆ భార్య అమాయకంగా బదులిస్తుంది.

'అయినా, ఆ చిలుక మాట్లాడేదే అయితే, మెడమీద కత్తిపెట్టినప్పుడైనా నేను మాట్లాడే చిలుకను అని చెప్పాలి కదండీ' అని మరింత అమాయకంగా అడిగేసరికి ఆ ఉద్యోగికి ఏంమాట్లాడాలో తెలియక అలా నిలుచుండిపోతాడు'..  ఈ కథలోలాగానే తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను సీమాంధ్రకు సరఫరా చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడే చిలుకలా నోరు మూసుకుని ఉన్నారని హరీష్ దుయ్యబట్టారు. దీంతో, ఒక్కసారిగా అసెంబ్లీ అంతా నవ్వుల మయమైంది. 

  • Loading...

More Telugu News