: ఇన్‌ఫెక్షన్‌ ఉంటే రంగు పడుద్ది!


మన ఉదరం అనేకానేక అంశాల సంగమం. ఇందులో ఏమాత్రం చిన్నపాటి తేడా వచ్చినా మొత్తం జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందునా బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వంటివి అయితే అవి వెంటనే తెలియవు. అలాకాకుండా ఇలాంటి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వెంటనే మన జీర్ణాశయం దాన్ని మనకు తెలియజెప్పేస్తే... చక్కగా వెంటనే ఇన్‌ఫెక్షన్‌ను నివారించే ఔషధాలను మనం తీసుకోవడానికి వీలవుతుంది.

మామూలుగా అయితే హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణాశయంలో లేదా చిన్న పేగులో మొదట్లో అల్సర్లు ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడే అవకాశాన్ని గుర్తించడానికి జీర్ణాశయంలోని కణజాల నమూనాను బయటికి తీసి విశ్లేషిస్తుంటారు. అలాగే శ్వాసలోని రసాయనాలను కూడా పరీక్షిస్తుంటారు. కానీ, అన్నిసార్లూ ఇవి కచ్చితమైన ఫలితాలను ఇవ్వవు. దీంతో పరిశోధకులు జీర్ణాశయంలో బ్యాక్టీరియా కారక ఇన్‌ఫెక్షన్లు ఉంటే జీర్ణాశయాన్ని ఆకుపచ్చ రంగులో వెలిగేలా చేసే సరికొత్త పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతి ద్వారా జీర్ణాశయానికి సంబంధించిన అల్సర్లను వెంటనే పసిగట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సదరన్‌ డెన్మార్క్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో మన జీర్ణాశయాన్ని పోలిన కృత్రిమ కణజాలం మీద హెచ్‌.పైలోరీ బ్యాక్టీరియా ఆకుపచ్చ రంగులో మెరిసేలా చేయగలిగారు. తాము కనుగొన్న ఈ పరిశోధన ముందు ముందు ఎంతగానో ఉపయోగపడగలదని, ప్రత్యేకంగా రూపొందించిన అణువులను జీర్ణాశయంలోకి పంపించి బ్యాక్టీరియాను ఆకుపచ్చ రంగులో మెరిసేలా చేయడానికి అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చిన్న మైక్రో కెమెరాను లోపలికి పంపించి మెరుస్తున్న జీర్ణాశయం రంగును చూడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News