: నువ్వెంతంటే నువ్వెంత.. సీఎం సమక్షంలో వాదులాడుకున్న పొన్నాల, ఎర్రబెల్లి
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ సమక్షంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావులు వ్యక్తిగత దూషణలకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత? అనుకునేంత దూరం వెళ్లారు. ఈ ఘటన అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో చోటు చేసుకుంది. దీంతో, అక్కడే ఉన్న మంత్రి కొండ్రు మురళి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు.
వివరాల్లోకి వెళితే, నిన్న రంగారెడ్డి జిల్లా రాయదుర్గం వద్ద మైహోంకు చెందిన భూముల్లో గేమింగ్ జోన్ ప్రారంభించడం అన్యాయమంటూ, ఎర్రబెల్లి నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కలిసేందుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో మంత్రి పొన్నాల దళారిగా వ్యవహరించారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పొన్నాల కూడా అక్కడకు వచ్చారు. దీంతో వారిరువురి మధ్య వాగ్వాదం మొదలై, ఘర్షణ వరకు వెళ్లింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో, సీఎం కలుగజేసుకున్నారు. ఈ వ్యవహారంలో తగు న్యాయం చేస్తానని సీఎం సర్దిచెప్పడంతో, ఎర్రబెల్లి బయటకు వచ్చారు.