: పీచుతో ఉబ్బసానికి చెక్ పెట్టచ్చు!
పీచు ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిసినా మనం దాన్ని గురించి పెద్దగా పట్టించుకోం. కానీ, మరోమారు శాస్త్రవేత్తలు పీచు పదార్ధాలున్న ఆహార పదార్ధాలను తీసుకోమని చెబుతున్నారు. పీచు ఉన్న ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలర్జీల వల్ల కలిగే ఉబ్బసం వ్యాధిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
వీరు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఆహారంలో ఉండే పీచు పదార్ధాలు పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను ప్రభావితం చేసి శ్వాసమార్గాల వాపు, నొప్పిని నివారిస్తాయని తేలింది. పీచు పదార్ధాలను అధికంగా తిన్న ఎలుకల్లో హ్రస్వ శృంఖల కొవ్వు ఆమ్లాలు విస్తారమై, అవి అలర్జీల వల్ల కలిగే ఉబ్బసాన్ని ఎదుర్కొనగా పీచు పదార్ధాలు తినని ఎలుకలు అలర్జీలకు గురయ్యాయని పరిశోధకులు గుర్తించారు. తాము నిర్వహించిన పరిశోధన ఆధారంగా పీచు పదార్ధాలను తీసుకుంటే శ్వాసమార్గాలు, ఊపిరితిత్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తేల్చారు.