: దొంగను పట్టించిన ప్రేమ సందేశాలు
ఫోన్ లో అపరిచితులతో ప్రేమాయణాలు పెరిగిపోతున్నాయని ఆరోపించేవారు ఈ వార్త చదివి హాయిగా నవ్వుకుంటారు. ఫోన్ ప్రేమాయణం ఓ ఘరానా దొంగల ముఠాను పట్టించింది. బెంగళూరు దగ్గర్లోని కృష్ణరాజపురంలో ఓ ఇంట్లోంచి ల్యాప్ టాప్, ఖరీదైన మొబైల్ చోరీకి గురయ్యాయి. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ ఫోన్ నెంబర్ నుంచి ఓ ఫోన్ కు ప్రేమ సందేశాలు బట్వాడా అవుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకోగా 45 సంవత్సరాల ఇద్దరు బిడ్డల తల్లికి ఆ ఎస్ఎంఎస్ లు చేరుతున్నాయి. అయితే ఆమె తన కుమారుడు పొరపాటున రాంగ్ కాల్ చేశాడని అప్పటి నుంచి ఈ మెసేజీలు వస్తున్నాయని ఆమె వాపోయింది.
దీంతో తమకు సహకరించాలని పోలీసులు ఆమెను కోరారు. పథకం ప్రకారం ఓ షాపింగ్ మాల్ లో కలుద్దామని ఆమెతో అతనికి ఫోన్ చేయించారు. దీంతో ఆమె మాల్ వద్ద బురఖాతో ఎదురు చూస్తుండగా మాట్లాడుతున్న వ్యక్తి దొంగ అని నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడు తెలిపిన వివరాల మేరకు అతని అనుచరులు అహ్మద్ నవాజ్, నాగరాజు, షఫీని అరెస్టు చేసి చోరీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.