: ఊరికే తింటేకాదు... ఈ పురుగులాగా ఉండగలగాలి!
ఊరికే కూర్చుని తినడం కాదు... మనం తిన్న తిండినుండే మనకు మనం రక్షణ కల్పించుకోగలగాలి. ఎలాగంటే ఈ పురుగులాగా! పొగాకు పంటను ఒక రకమైన గొంగళి పురుగు ఆశిస్తుంది. ఈ పురుగును ఏ పక్షులో, లేదా మరే తొండలో తినేస్తాయా... అనుకుంటే అలా జరగదు. ఎందుకంటే ఇవి చాలా కంపు కొడతాయి. దీంతో వాటి పరిసరాల్లోకి ఇతర కీటకాలు వెళ్లకుండా ఉంటాయి. ఇలా అవి తాము తింటున్న ఆహారం ద్వారానే తమను తాము కాపాడుకుంటాయి.
పొగాకును తినే ఒకరకమైన గొంగళి పురుగులను శాస్త్రవేత్తలు సేకరించి వాటిని ప్రత్యేకంగా పరిశీలించారు. అవి తాము తినే ఆహారంనుండే తమకు రక్షణ ఏర్పరచుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఇందుకోసం వారు కొన్ని పొగాకు తినే గొంగళి పురుగులను పరిశోధనా శాలల్లో పెంచారు. వాటికి కొన్నింటికి నికోటిన్ ఉన్న పొగాకును, మరికొన్నింటికి నికోటిన్ లేని పొగాకును తినిపించారు.
తర్వాత వాటిని పరిశీలించగా నికోటిన్ తిన్న గొంగళిపురుగుల్లో ఒక రకమైన జన్యువు ఉత్తేజితమై వాటిలోనుండి నికోటిన్ బయటికి వెదజల్లేందుకు తోడ్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గొంగళిపురుగు తాను తినే పొగాకులోని నికోటిన్ విషపదార్ధాన్ని తన శరీరంలోని చిన్న చిన్న రంధ్రాలగుండా బయటికి పంపిస్తుందని, ఇది వెదజల్లే దుర్వాసన కారణంగా దాని పరిసరాల్లోకి ఇతర కీటకాలు ఏవీ వెళ్లవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.