: ఫిలింనగర్ కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేసిన చిరంజీవి
హైదరాబాద్ ఫిలిం నగర్ లోని 'ఫిలింనగర్ కల్చరల్ సెంటర్'లో నూతన సంవత్సర వేడుకలు నిన్న రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సారధ్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 2013లో దివంగతులైన వడ్డే రమేష్, ఏవీఎస్, శ్రీహరి, జగ్గారావు, కె.కె.రెడ్డి, భావనారాయణ, వై.హరికృష్ణ, ఎమ్.ఎస్.రెడ్డిల కుటుంబీకులకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఆర్థిక సహాయార్థం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, "సినిమాకు సంబంధించిన కార్యక్రమం చిన్నదైనా, పెద్దదైనా పాల్గొన్నప్పుడు... ఇదే కదా నా కుటుంబం అని అనిపిస్తుంటుంది" అని చెప్పారు. తనతో పాటు నటించిన వ్యక్తులు ముఖ్యంగా వడ్డే రమేష్, శ్రీహరి, ఏవీఎస్ లాంటి వారు దూరంకావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.