: టీడీపీకి 200 సీట్లు ఖాయం: యనమల
2014లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 200 సీట్లు రావడం ఖాయమని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో టీడీపీపై నమ్మకం రోజురోజుకీ పెరుగుతోందని అన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విభజన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర, తెలంగాణల్లో పూర్తిగా పతనమైందని తెలిపారు. విభజన పాపంలో వైఎస్సార్సీపీ ప్రమేయం ఉండడం వల్లే అఫిడవిట్ల నాటకమాడుతోందని యనమల అభిప్రాయపడ్డారు.
అఫిడవిట్లను కోర్టులో దాఖలు చేస్తేనే విలువ ఉంటుందని, జగన్ కు ఆమాత్రం పరిజ్ఞానం కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. బిల్లు తప్పుల తడకగా ఉండడంతో దానిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించేముందు ఏదో ఒక తీర్మానం చేయాలని ఆయన అన్నారు. ఎలాంటి తీర్మానం లేకుండా ఎలా చర్చిస్తారని యనమల ప్రశ్నించారు.