: వెంకన్న దర్శనానికి భారీగా ప్రముఖులు.. భక్తులకు తప్పని ఇక్కట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వీఐపీ పాస్ కావాలంటూ టీటీడీ అధికారులపై పలువురు ఒత్తిడి తెస్తున్నారు. జనవరి ఒకటో తేదీన ఒక్కొక్క వీఐపీకి ఆరు పాస్ లు మాత్రమే మంజూరు చేస్తామంటూ టీటీడీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. నూతన సంవత్సరాది కావడంతో దర్శనానికి అనుమతి కావాలంటూ ఇప్పటికే వందలాదిగా అమాత్యులు, అధికారుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.
సంవత్సరం ఆఖరి రోజు, కొత్త సంవత్సరాది కావడంతో... జనవరి ఒకటో తేదీన దర్శనానికి వీఐపీ పాసులు కోరుతూ ఇప్పటికే 40 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు లేఖలు పంపారు. మరో 60 మంది ఐఏఎస్ అధికారులు తిరుమలేశుని దర్శనానికి సిద్ధమవుతున్నారు. ఇక ఎమ్మెల్యేలయితే.. ఏకంగా 160 మంది వరకూ పాసుల కోసం ఎదురు చూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరందరికీ పాసులు జారీ చేస్తే సామాన్య భక్తులు ఆ రోజు వెంకన్న దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించక తప్పదు. జనవరి ఒకటిన కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనానికి 25 వేల టోకెన్లు మాత్రమే ఇస్తామని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. మరి, ప్రముఖుల దర్శనాన్ని పరిమితం చేస్తారా? లేక, అధికారుల ఒత్తిడితో చేతులెత్తేస్తారా? తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.