: దేశంలో సౌభాగ్య నగరం ఇదే
దేశంలో సౌభాగ్యంతో వర్థిల్లుతున్న పట్టణం గుర్గాన్ అని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా ఈ విషయంలో ముందంజలో నిలవలేకపోయింది. పట్టణాల్లోని ప్రజలు వినియోగిస్తున్న వస్తువుల ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాకు వచ్చింది. కంప్యూటర్, ల్యాప్ టాప్ సహా అన్ని రకాల గాడ్జెట్లను గుర్గాన్ లో చాలా మంది కలిగి ఉన్నారట. దేశంలోని 16 పట్టణాల్లో క్రిసిల్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గుర్గాన్ లో 27 శాతం ఇళ్లల్లో అన్ని రకాల గాడ్జెట్లు ఉన్నాయని వెల్లడించింది. ఇక చెన్నైలో 24 శాతం ఇళ్లల్లో, బెంగళూరులో 23.4శాతం ఇళ్లలో అన్ని రకాల ఆధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉన్నాయి. ముంబైలో కేవలం 15.7శాతం ఇళ్లల్లోనే ఇలా అన్ని రకాల గాడ్జెట్లు ఉన్నాయి. ఢిల్లీలో భాగంగా ఉండే గుర్గాన్ హర్యానా రాష్ట్రం కిందకు వస్తుంది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలకు ఇది కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక దేశంలోనే అతి తక్కువగా ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో 4.6శాతం ఇళ్లల్లో అన్ని రకాల గాడ్జెట్లు ఉన్నాయట.