: కన్నీరూ కొన్ని విషయాలను చెబుతుంది
మనకు బాధ కలిగినా, సంతోషం కలిగినా మనల్ని పలకరించే కన్నీరు మనలోని విటమిన్ లోపాలను చెప్పేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందునా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎలాంటి విటమిన్ లోపాలు ఉన్నాయి? అనే విషయాన్ని కచ్చితంగా గుర్తించలేము. చిన్న పిల్లల్లో విటమిన్ లోపాలను వారి కన్నీటి ద్వారా చక్కగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని ఏ విధంగానూ ఏడ్పించకుండా వారి కన్నీటిని సేకరించి దాని పరిశీలించడం ద్వారా వారిలోని విటమిన్ లోపాలను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పిల్లల్లో విటమిన్ లోపాలను గుర్తించాలంటే ఇప్పటి వరకూ వారి రక్తపరీక్ష చేసి గుర్తించేవారు. ఇది కాస్త నొప్పితో కూడుకున్న పరీక్ష. కానీ మిషిగన్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అడ్రీన్ మినెరిక్ నేతృత్వంలో ఒక సరికొత్త పరీక్షను కనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా వారి కంటి నీరును సేకరించి పరీక్షించడం ద్వారా వారిలోని విటమిన్ లోపాలను తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం పిల్లల కంటిలో దిగువ కనురెప్పపై ఒక చిన్న పట్టీని కాసేపు పెట్టి కంటిలోని ద్రవాన్ని సేకరిస్తారు.
తర్వాత ఆ ద్రవంపై పరీక్ష జరిపి వారిలోని విటమిన్ లోపాలను గుర్తిస్తారు. వీరు కనుగొన్న పరికరం ద్వారా జరిపిన ఫలితాలను, రక్తపరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలతో పోలిస్తే ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, వీరి సంఖ్య 40 శాతం కన్నా కూడా ఎక్కువగా ఉందని, ఇలాంటి వారికి రక్త పరీక్ష జరిపి ఫలితాలు చూసేలోగా పిల్లల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని, ఈ నేపధ్యంలో ఇలా సులువుగా తక్షణం ఫలితాలను తెలిపే చవకైన పరికరాన్ని తాము రూపొందించామని అడ్రీన్ తెలిపారు. తాము కనుగొన్న పరికరాన్ని మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నట్టు అడ్రీన్ చెబుతున్నారు.