: సమయంతోబాటు స్వామిని కూడా చూపిస్తుంది
మన చేతికి ఇమిడి ఉండే వాచీ సమయంతోబాటు శ్రీవారిని కూడా చూపిస్తే బాగుంటుంది కదూ. అలాంటి వాచీలను సెంచురీ సంస్థ తయారుచేసింది. అచ్చమైన బంగారంతో తయారుచేసిన ఈ వాచీల ధర కూడా భారీగానే ఉంది. మేలిమి రకానికి చెందిన వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి పూర్తి బంగారంతో తయారుచేసిన ఈ వాచీ ఖరీదు అక్షరాలా రూ.27 లక్షలు మాత్రమే.
ఈ వాచీ గురించి బెంగళూరుకు చెందిన రోడియో డ్రైవ్ లగ్జరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ పృధ్వీరాజ్ బగ్రేచ మాట్లాడుతూ ఈ గడియారాన్ని స్వర్ణకారులు చేతిపని నైపుణ్యంతో తయారుచేశారని చెప్పారు. ఒక్కో గడియారం తయారీకి 111 గ్రాముల బంగారాన్ని, మేలిమి రకానికి చెందిన 13 వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారుచేశారు. గడియారం లోపలి భాగంలో వజ్రాలు పొదిగిన శ్రీవేంకటేశ్వరస్వామి బంగారు ప్రతిమను ఏర్పాటు చేశారు. వెనుకభాగంలో కూడా ఆనందనిలయం ప్రతిమను అమర్చారు. చేతిపట్టీలో ఒకవైపు బంగారంతో లాక్‌ను ఏర్పాటుచేసిన ఈ వాచీల్లో రెండింటిని మంగళవారం నాడు శ్రీవారి పాదాలముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు.