: పేదవాడి ఆపిల్ జామకాయ
రోజుకు ఒక ఆపిల్ పండు తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారని మనం ఎప్పటినుండో వింటున్నాం. కానీ పేదవాడికి ఆపిల్ రోజుకు ఒకటి కొనగలిగే స్థోమత ఉండదుకదా... అందునా ఇప్పుడు పెరుగుతున్న ధరల నేపథ్యంలో పేదవాడు అసలు ఆపిల్ పండును చూసే ధైర్యం కూడా చేయలేడు. అలాంటి పేదవారికి ఆపిల్ పండులాగా మేలు చేసే తక్కువ ధరకు లభించే పండు జామ. దీనిలో బోలెడన్ని పోషకాలున్నాయి. ఎలాగంటే... జామపండ్లలో పీచుపదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది షుగరు పేషంట్లకు దివ్యౌషధంగా చెప్పవచ్చు. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నా వాటిలో ఉండే పీచు పదార్ధం మన ఆహారం అరుగుదలకు ఎంతగానో ఉపయోడపడుతుంది.
జామపండ్ల పైతొక్కలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ పండులో విటమిన్ ఎ, 'బి'లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బాగా పండిన పండులోకన్నా కూడా దోరగా మాగిన జామపండ్లలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా నోటి చిగుళ్ల వాపుకు జామ ఆకులను మందుగా కూడా కొందరు వాడుతారు. పండిన జామపండ్లనుండి జామ్‌లు, జెల్లీలను కూడా ఇప్పుడు తయారుచేస్తున్నారు. ఈ పండ్లలో పోషక ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల వీటిని ఊబకాయులు కూడా విరివిగా ఉపయోగించవచ్చు. కాబట్టి తక్కువ ధరకు దొరికే జామను చిన్నచూపు చూడకుండా చక్కగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.