: ప్రముఖ కన్నడ కవి, రచయిత శివరుద్రప్ప కాలధర్మం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కన్నడ కవి, రచయిత అయిన జీఎస్ శివరుద్రప్ప ఇవాళ బెంగళూరులోని ఆయన నివాసంలో కన్నుమూశారు. 87 సంవత్సరాల శివరుద్రప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. కన్నడ సాహిత్య అవార్డుతో పాటు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులు ఆయనకు లభించాయి.
సాహిత్య రంగానికి చేసిన సేవలకు కర్ణాటక ప్రభుత్వం ‘రాష్ట్ర కవి’ అనే బిరుదుతో సత్కరించింది. కన్నడ సాహిత్యానికి శివరుద్రప్ప విశేష కృషి చేశారని, ఆయన మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రేపు (మంగళవారం) ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులు సంతాపం ప్రకటించనున్నట్లు తెలిపారు. శివరుద్రప్ప అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.