: ‘పద్మశ్రీ’లను వారం రోజుల్లో సరెండర్ చేయండి: మోహన్ బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు ఆదేశం
పద్మశ్రీ బిరుదును సినిమా టైటిల్స్ లో వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందంపై భారతీయ జనతా పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇటీవల విడుదలైన ‘దేనికైనా రెడీ’ సినిమా టైటిల్ ను పిటీషనర్ ఉదహరించారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పేరుకు ముందు, వెనుక ‘పద్మశ్రీ’ బిరుదుని వాడుకోవడాన్ని తప్పుబట్టింది. పిటీషనర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఇంతకు ముందే సుప్రీంకోర్టు స్పష్టంగా మార్గదర్శకాలిచ్చినా పట్టించుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రహ్మానందం, మోహన్ బాబులకు నోటీసులు జారీ చేస్తూ.. ‘పద్మశ్రీ’ బిరుదులను వెనక్కి ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయా నటులు ‘పద్మశ్రీ’ బిరుదులను వారం రోజుల్లోగా రాష్ట్రపతికి సరెండర్ చేయాలంటూ నోటీసులో పేర్కొంది.