: ఈ ఐదడుగుల బుల్లెట్టు కాపలా కాస్తుంది
మన పోలీసులు ఎంతగా పహరా కాస్తున్నా... ఒకవైపు పోలీసులు గస్తీ తిరుగుతుంటే మరోవైపు దొంగలు చక్కగా పని ముగించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో దొంగలను అడ్డుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. పోలీసులకు ఈ తలనొప్పిని తగ్గించడానికి గస్తీ రంగంలోకి పోలీసుల బదులు రోబోలు దిగనున్నాయి. ఇందుకోసం ఒక కొత్తరకం రోబోలను పరిశోధకులు తయారుచేశారు. ఈ రోబోలు నేరాలను అదుపులో ఉంచడమేకాదు... అసలు నేరం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే పసిగడతాయని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన 'నైట్స్కోప్' సంస్థ ఒక కొత్తరకం రోబోను తయారుచేసింది. ఈ రోబో జరగబోయే నేరాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇప్పటి వరకూ రోబోలు బోలెడన్ని పనులు చేసేవి. ఈ కొత్తరకం రోబో నేరాలను పసిగట్టి వాటిని అదుపులో ఉంచడానికి ఉపకరించనుంది. ఐదడుగుల ఎత్తున బుల్లెట్ ఆకారంలో ఉండే ఈ కొత్తరకం రోబో సెన్సార్ల సాయంతో తన పరిసరాల్లో జరిగేవన్నీ తెలుసుకోగలదు.
చూసి, విని, తాకి, వాసన పసిగట్టి తెలుసుకోగలిగిన సామర్ధ్యం ఉన్న ఈ రోబో పోలీస్ పేరు కే5. ఈ రోబో పోలీస్ తన చుట్టూ ఉన్న పరిసరాలపై చేసిన పరిశీలనను తన వద్దనున్న సామాజిక, ఆర్ధిక వివరాలతో పోల్చి చూసుకుని ఎప్పుడు, ఎక్కడ నేరం జరిగేందుకు ఆస్కారం ఉంది? అనే విషయాన్ని ఇట్టే ఊహిస్తుందట. అంతేకాదు, ఆ సమాచారాన్ని తనకు అనుసంధానంగా ఉన్న వ్యవస్థ మొత్తానికీ వైఫై సాయంతో చేరుస్తుందట. దీంతో నేరాలను జరగకుండా ముందుగానే ఆపడానికి వీలవుతుందట. మొత్తానికి ఈ ఐదడుగుల బుల్లెట్ పోలీసులకు బాగానే ఉపకరిస్తుంది.