: ఏజింగ్‌ను ఇలా కూడా కంట్రోల్ చేయవచ్చట
వయసు పెరుగుతుంటే దాని తాలూకు ఛాయలు మన చర్మంపై చక్కగా ప్రతిఫలిస్తాయి. చర్మంపై వయసు తాలూకు ప్రభావం పడకుండా కాపాడేందుకు మనం నానా తంటాలు పడుతుంటాం. అలాకాకుండా చిన్న చిట్కాలను పాటిస్తే వయసు ప్రభావాన్ని ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం ఎక్కడైనా రెస్టారెంట్లకు వెళ్లి, సుష్టుగా భోజనం చేసిన తర్వాత అక్కడి సర్వరు బిల్లుతోబాటు సోంపు పలుకులు ఉండే ప్లేటును మనముందు పెడతాడు. కొందరు కాసిన్ని సోంపు పలుకులను నోట్లో వేసుకుంటారు. మరికొందరు పెద్దగా పట్టించుకోరు. కానీ సోంపును నమలడం వల్ల ముఖ్యంగా భోజనానంతరం నమలడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుందట. అంటే సోంపుకు జీర్ణశక్తిని పెంచే శక్తి ఉందట. వంద గ్రాముల సోంపులో 39 గ్రాముల ఆహార సంబంధిత పీచు ఉంటుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఫలితంగా మలబద్దకం సమస్య దరిచేరదు.
బాలింతలకు సోంపును వేడి నీటిలో మరిగించి ఇస్తే ఆ నీటిని తాగడం వల్ల బిడ్డకు పాలు బాగా అందుతాయి. దగ్గు వదలకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచాడు సోంపును నమలడం వల్ల దగ్గునుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు సోంపు నూనెతో మర్దన చేసుకుంటే ఉపశమనాన్ని పొందవచ్చు. సోంపులో ఇనుము, రాగి, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎర్రరక్తకణాలు ఏర్పడడానికి తోడ్పడతాయి.
జింకు పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల అది మన శరీరంలోని ఎంజైముల పనితీరును మెరుగుపరచి, జీవక్రియలు సక్రమంగా సాగేలా చూస్తుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తాయి. దీని ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు దూరం కావడంతోబాటు మన ముఖంలో వృద్దాప్యానికి సంబంధించిన ఛాయలను కూడా దూరంగా ఉంచుతుందట. మనం తేలిగ్గా తీసుకునే సోంపులో ఇన్ని ప్రయోజనాలున్నాయి మరి.